పరీక్షల వేళ దిక్సూచిగా టీ-సాట్.. విద్య, నిపుణ పేరిట  స్టడీ మెటీరియల్

పరీక్షల వేళ దిక్సూచిగా టీ-సాట్.. విద్య, నిపుణ పేరిట  స్టడీ మెటీరియల్

విద్యను  పంచిపెడితే విజ్ఞానం పెరగడమే కాకుండా సమాజానికి మేలు చేసినవారవుతారు. ఎప్పుడైనా సరే విద్యకున్న  ప్రాధాన్యత దేనికీ ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు పెద్దగా సంపదలు కూడబెట్టలేకపోయినా వారికి ఉన్నత చదువులు కల్పిస్తే భారీ ఆస్తులిచ్చినట్టే అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే నేడు కార్పొరేట్ సంస్కృతిలో  నిరుపేదలకు విద్య అందని ద్రాక్షలా మారింది.

ఇలాంటి సందర్భంలో తెలంగాణలో టీ-సాట్ (తెలంగాణ స్కిల్స్, అకడమిక్  అండ్  ట్రైనింగ్స్)  పేదలకు ఆశాజ్యోతిగానే కాకుండా, వారు ఉన్నత విద్యావంతులు కావడానికి సోపానంగా, దిక్సూచిగా మారింది.  

పరీక్షల కాలం మొదలుకావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నవేళ వారికి టీ-సాట్ ‘విద్య’, ‘నిపుణ’ పేరిట విలువైన స్టడీ మెటీరియల్ అందజేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్మీడియెట్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న వేళ టీ-సాట్ పేద విద్యార్థులకు వరంగా మారింది.

 ఇంటర్మీడియట్  విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షల సమయంలో ‘జ్ఞాన దీక్ష’ పేరిట ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.  ప్రతి సబ్జెట్‌కు సంబంధించి అరగంట నిడివి వీడియోలను రూపొందించడమే కాకుండా విద్యార్థుల సందేహాలను  నివృత్తి చేసేందుకు నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు  ప్రసారం చేస్తోంది. భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు తర్ఫీదు ఇస్తోంది. సైన్స్ విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా ప్రాక్టికల్స్ రూపంలో బోధిస్తోంది. 

కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా...

ఇంటర్మీడియట్ అనంతరం ‘ఎప్‌సెట్‌’ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ  సబ్జెక్టులకు సంబంధించి టీ-సాట్ ప్రత్యేకంగా 112 రోజులుపాటు 450 ఎపిసోడ్స్ ప్రసారాలు చేయడంతో డబ్బు ఖర్చు చేసి  కోచింగ్‌లకు వెళ్లలేనివారికి ఎంతో ఉపయోగకరంగా మారింది.   కళాశాలల విద్యకు  ప్రవేశద్వారమైన పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో టీ-సాట్ ద్వారా ప్రత్యేక పాఠాలను ప్రసారం చేసేందుకు రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తోంది.

700కు పైగా పాఠ్యాంశాలు

ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రతిరోజు తెలుగు, ఆంగ్ల భాషల్లో నాలుగు సబ్జెక్టులపై నిపుణులతో డిజిటల్​తెరలపై పాఠ్యాంశాలను ప్రసారం చేయడంతో పాటు విద్యార్థుల సందేహాలను నివృత్తం చేస్తున్నారు.  తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలకు సంబంధించి దాదాపు 1500 అంశాలకు సంబంధించి 700కు పైగా పాఠ్యాంశాలను టీ-సాట్ ప్రసారం చేయడం విశేషం.   టీ-సాట్ తనదైన పాత్ర పోషిస్తుండడంతో ఈ విద్యా సంవత్సరంలో  పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలలో ప్రభుత్వ విద్యాసంస్థలు మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమనే  విశ్వాసం కనిపిస్తోంది.   

డిగ్రీ,  ఇంజినీరింగ్,  పీజీ కోర్సులు చదివేవారికి కూడా  టీ-సాట్​  తోడ్పాటు  అందిస్తోంది.  ప్రభుత్వ ఉద్యోగాలు, టీజీపీఎస్‌సీ, యూపీఎస్‌సీ మొదలగు పరీక్షల కోసం ఎకానమీ, బడ్జెట్, తెలంగాణ ఉద్యమం చరిత్ర, భారత చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర, దేశ భౌగోళికం, భారత రాజ్యాంగం, రాజకీయ చరిత్ర, గణితం, సైన్స్,  జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ అంశాలపై టీ-సాట్ నిపుణ పేరిట రోజూ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇందుకోసం 500 రోజుల కోసం 600 ఎపిసోడ్స్ రూపొందించే ప్రణాళికలతో టీ సాట్  ముందుకు రావడం యువతకు గొప్ప వరం. 

టెట్ పరీక్ష కోసం..200 మాడ్యూల్స్ ప్రసారం

టెట్ పరీక్ష కోసం కూడా 44 రోజుల పాటు 200 మాడ్యూల్స్  ప్రసారం చేసి ఎంతోమందికి ఉపయోగపడింది.  టీజీపీఎస్‌సీ గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ప్రధాన సబ్జెక్టులలో 750 ఎపిసోడ్స్ ప్రసారాలతో తోడ్పాటు అందిస్తోంది. పోటీ పరీక్షల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసి  కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికి  జనరల్ స్టడీస్‌పై ‘జీఎస్ ఫర్ ఆల్‌’ పేరిట ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది. 

టీజీపీఎస్‌సీ   గ్రూప్ 1,2,3 ఉద్యోగాలకే కాకుండా కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలైన ఆర్​ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ పరీక్షల కోసం కూడా విలువైన కంటెంట్‌కు సంబంధించి టీ-సాట్ తమ నెట్‌వర్క్ డొమైన్‌లో 40వేలకు పైగా వీడియోలును అందు బాటులో ఉంచడం సాధారణమైన విషయం కాదు.  

 కృషి  అనన్యం

తెలంగాణ  విద్యా రంగంలో  ప్రధాన పాత్ర పోషిస్తున్న టీ-సాట్ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ మరింత చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో,  ఐటీ  కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సంస్థ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి  ప్రత్యేక కృషి చేస్తున్నారు.  

 ప్రభుత్వ విద్యాసంస్థల్లో  పేద విద్యార్థుల‌  ప్రతిభను వెలికి తీసేందుకు టీ-సాట్  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘విద్యార్థుల వార్షిక పోటీలు-2025’ కార్యక్రమం నిర్వహించి  క్విజ్,  వ్యాస రచన,  వ‌క్తృత్వ పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు మంత్రి శ్రీధర్ బాబు ద్వారా సర్టిఫికెట్లు అందజేసింది. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 22 వేలకుపైగా విద్యార్థులు పాల్గొనడమే  టీ-సాట్​కు  లభిస్తున్న ఆదరణకు నిదర్శనం.  
దేశంలో నెంబర్ వన్ ఎడ్యుకేషనల్ నెట్‌వర్క్​గా టీసాట్

దేశంలోనే  నెంబర్ వన్ ఎడ్యుకేషనల్  నెట్‌వర్క్​గా టీసాట్ నిలవడం  తెలంగాణకు గర్వకారణం. 
 విద్యా ప్రసార చానళ్లలో 48 లక్షల యూజర్స్​తో డిజిటల్ ప్రసారాల్లో ప్రథమస్థానం కైవసం చేసుకుంది. యూట్యూబ్‌లో 8.4 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్, సుమారు 14 కోట్లకు పైగా వ్యూస్‌తో టీసాట్ దూసుకుపోతోంది. 

తెలంగాణలో సుమారు 80 లక్షలకు పైగా కుటుంబాలకు వైవిధ్యమైన ప్రసారాలు అందిస్తూ అన్ని వర్గాలకు తోడ్పడుతోంది.   ఉన్నత విద్యకు పునాదులైన పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు టీసాట్ అందిస్తున్న స్టడీ మెటీరియల్ వెలకట్టలేనిది. సందేహాలను నివృ త్తి  చేస్తూ  టీసాట్ ప్రసారం చేస్తున్న పాఠ్యాంశాలు విద్యార్థులకు తోడ్పడాలని ఆశిస్తూ... పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు.

-- డా.ఐ.వీ.మురళీకృష్ణ శర్మ-